కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

కాగడాగా

కాగడాగా వెలిగిన క్షణం తమ్ముడు శ్రీను - యెం యెస్ ఆర్ కోసం ... 25 వ వర్ధంతి సందర్భంగా ...
నిప్పు కోసం

(తమ్ముడు శ్రీను - యెమ్ యెస్ ఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా)

1988 సెప్టంబర్ లో ఒక రోజు మధ్యాహ్నం. వర్షాలు పడి వాతావరణం కొంచెం చల్లబడ్డది. వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ లో ఎలెక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో నా రూమ్ లో కూర్చుని ఏదో క్లాస్ కు ప్రిపేర్ అవుతున్న. ʹఎక్స్క్యూస్ మీ సర్ʹ అంటూ వినబడితే తలెత్తి చూసిన. రూమ్ దర్వాజ దగ్గర ఒక పిలగాడు. లేత మొఖం, మెరిసే కండ్లు – తెల్లగ అమాయకంగ నవ్వుకుంట ʹగుడ్ ఆఫ్టర్ నూన్ సర్ ʹ అన్నడు. కల్మషం లేని నవ్వు అది. ప్లీజ్ కం ఇన్ అని రమ్మన్న నా నోట్స్ ల నుంచి తల పక్కకు తిప్పి. ʹసర్ నేను ఫర్స్ట్ యియర్, ఈ సీ ఈ సర్ మాది వరంగల్ʹ అని పరిచయం చేసుకున్నడు. ʹమీరు ఆంటీ రాగింగ్ స్క్వాడ్ కు హెల్ప్ చేసున్డ్రట కదా సర్ʹ అన్నడు. ʹఅవును నిన్ను యెవరన్న రాగింగ్ చేస్తుండా ఇంకా? అదెప్పుడో ఆగిపోవాల్నేʹ అన్న నేను. లేదు సర్ ఆగిపోయింది మీకు థాంక్స్ చెప్దామనుకున్న అన్నడు తను; సర్ మీరు కవిత్వం రాస్తరట కదా నేను కూడా రాస్తా సర్ నా కవితలు ఒక సారి చూడరా మీరు అన్నడు. ఆ పిలగాని అమాయకత్వమూ ఎటువంటి జంకూ గొంకూ ఇన్హిబిషన్స్ లేకుండా తను కలుపుగోలుగా మాట్లాడే పద్దతీ నన్ను ముగ్ధున్ని చేసింది. ʹతప్పకుండా! ఉన్నయా నీ పోయేమ్స్ నీ దగ్గర?ʹ అని అడుగుడే ఆలస్యం చేతిల ఉన్న నోట్ బుక్స్ లో ఒకటి తీసి నాకు ఇచ్చిండు. చూడండి సర్ అనుకుంట. వండర్ఫుల్ అని ఆ నోట్ బుక్ తీసుకున్న. కవర్ పేజీ తెరిచి తీసి చూస్తే లోపల అద్భుతమైన చేతి వ్రాత – గొప్ప ఆర్టిస్టిక్ గా గొప్ప మెచూరిటీ తో కవిత వాక్యాలుగా రాశి పోసిన కవితలు. ముచ్చట పడి పోయిన. నా స్టూడెంట్స్ లో ఎవరన్నా కవిత్వమన్నా సామాజిక స్పృహ అన్నా నా పెయ్యన్తా పులకరించి పోయేది. అటువంటిది ఒక మొదటి సంవత్సరం పిలగాడు, నిండా పద్దెనిమిది ఏండ్లు నిండని లేలేత చిగురుటాకుల పచ్చదనాల పిలగాడు కవితలు రాసి నా చేతులపెడితే ఎంత సంబరమో వేరే చెప్పాల్నా. సరే నేను చదువుతా ఇప్పుడో క్లాస్ ఉంది వచ్చింతర్వాత చదువుట అని నోట్ బుక్ తీసుకొని పదిలంగా టేబిల్ మీద పెట్టి తనకు షేక్ హాండ్ ఇచ్చి క్లాసు కు బయలుదేరిన. సరే సర్ ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైమ్ సర్ అని అతను వెళ్లిపోయిండు. నేను క్లాస్ వైపుకు నడిచిన. ఆ తొందరలో ఆ పిలగాని పేరే అడుగుడు మర్చిపోయిన.

క్లాస్ అయినంక రూమ్ కొచ్చి నా చేతిల పుస్తకాలు అక్కడ పడేస్తుంటే కనబడ్డది అతని నోట్ బుక్. కూర్చుని తిరగేయడం మొదలు పెట్టిన. ఒక్కొక్క కవిత చదువుతూ పోతున్న. కండ్లల్లో నీళ్ళు తిరుగుతున్నయి. గొప్ప మెచూరిటీ గొప్ప అనుభూతి. ఇంకా కవిత్వం రాయడం లో పూర్తి పరిపక్వత రాకపోయినా వస్తువులో అనుభూతిలో వ్యక్తీకరణ లో అద్భుతంగా ఉన్నాయి. ఒక పదిహేడేండ్ల పిలగాడు రాసినట్టు లెవ్వు. నిజానికి నాకప్పుడు 23 యేండ్లే. చాలా గొప్పగా ఫీల్ అయిన ఆ పిలగాని బావ వ్యక్తీకరణ లో తడిచిపోయిన. మొత్తం నోట్ బుక్ చదవడం ఐ తల ఎత్తి చూస్తే సమయం ఐదున్నర దాటింది. కాలేజీ నాలుగున్నర దాంకనే. లేచి బాగ్ సదురుకొని నా మోటార్ సైకిల్ వైపు బయలుదేరిన. రూమ్ కు వచ్చేసరికి ఆరు దాటింది. అప్పుడు ముషీరాబాద్ బాలాజీ టాకీస్ దగ్గర గాంధీ నగర్ లో మా రూమ్. నేను కిరణ్ ప్రకాష్ సురేశ్ ఉండెటోల్లము పర్మెనెంటుగ. చాలా మంది వచ్చి పోతుండేటోల్లు రోజూ. పోంగనే ప్రకాష్ కిరణ్ ఉన్నరు రూమ్ ల. ʹఇగో ఈ కవిత్వం చూడుండ్రి అని ఇచ్చిన ఆ నోట్ బుక్. మా కాలేజీ ల ఎవరో మొదటి సంవత్సరం పిలగాడు రాసిండట. తెచ్చి ఇచ్చిండు.ʹ అన్న గొప్ప ఉత్సాహంగ. నా ఆత్రాన్ని ఉత్సాహాన్ని చూసి ముచ్చట పడి నా చేతులోనుండి నోట్ బుక్ తీసుకుని చదివిండ్రిద్దరూ. బాగున్నయి చాలా యేమి పేరు ఆ పిలగానిది ఇంకేం విరసం లో చేర్పించరాదూ అన్నారు. పేరు అడుగుడు యాది మరిచిన. విరసం లో కొంచెమాగి పరిచయం చేద్దాం అన్న.

తెల్లారి ఆదివారం కావడంతో ఆ పిలగాన్ని కలవడానికి ఒక రోజు ఆగాల్సి వచ్చింది. ఎందుకో ఆ రోజంతా అతని కండ్లలో మెరుపూ తెల్లని చిరునవ్వూ, అతని లేలేత ముఖమూ యాదికొచ్చినయి ఊకే. మళ్ళా సోమవారం కాలేజీకి పోయినంక నా కండ్లు తన కోసమే వెతికినయి. మధ్యాహ్నం దాంక కనబడలేదు తను. ఇగ ఉండబట్టలేక నేనే ఈ సీ ఈ మొదటి సంవత్సరం క్లాసుకు పోయిన. ఏదో క్లాసు జరుగుతుంది. క్లాస్ అయేదాంక ఆగి ఎదిరి చూసిన. ఆ పిలగాని పేరు తెల్వదాయే. (నోట్ బుక్ మీద కూడా లేకుండే). చాలా సేపు చూసి ఉసూరు మనుకుంట రూకు వచ్చిన. ఆ రోజు సాయంత్రం దాంక కనబడలేదు తను. తెల్లారి కూడా అంతే. తానే నా దగ్గరికి రావాలే. రాలేదు. అట్లా ఆ వారం గడచిపోయింది. తను రాలేదు కనబడలేదు. నాకు తీవ్రమైన ఉద్వేగం కలిగింది. ఏమైండు తను. ఇట్లా కనబడి అట్లా మాయమైన్దు. వెతుకులాట తీవ్రమైంది. ఎందుకో తనంటే విపరీతమైన అభిమానం యేర్పడ్డదేమో ఏదో తెలియని బంధమేమో – అర్థం కాలేదు. ఒకరిద్దరు అడిగిండ్రు యెండి అట్లా ఉన్నవు అని. యేమి లేదులే అని తప్పించుకున్న. చివరికి ఉండబట్ట లేక మొదటి సంవత్సరం చెప్పే సర్ దగ్గరకు పోయి అడిగిన. అయిదార్గురు గైర్హాజరు ఉన్నారు యెట్లా గుర్తు పడటం అన్నడు తను. ఆ వారమంతా మనసు మనసులో లేదు.

సోమవారం కాలేజీకి పోయి యధాతథంగా క్లాసులు తీసుకుంటున్నా నా కండ్లన్నీ తాననే వెతుకుతున్నాయి. అసలేమిటి? నాకేమన్నా పిచ్చా – ఆ పిలగాడు కలిసిందే ఒక అద్ధ గంట సేపు. ఒక కవిత్వం నోట్ బుక్ తప్ప తనకూ నాకూ సంబంధమేమీ లేదు. కవిత్వానికింత ఆకర్షణ నా అనుబంధమా – నాకు తెల్వకుండా నేనే గుంగునాయించుకుంటున్న. ఎంతకూ కనబడక పోయే సరికి నిరాశా నీరసమూ ఆవరించి ముంచేసినయి. తర్వాతి క్లాస్ అన్నా తీసుకుందాం అని నోట్స్ డస్టర్ చాక్ పీస్ తీసుకుంటుంటే మళ్ళా వినబడింది. అదే కంఠం లేలేత చిగురుటాకులు గాలికి రాసుకున్నట్టు యెక్స్క్యూస్ మీ సర్ అని. చివ్వున తల తింపి చూసిన. అతడే అదే చిరునవ్వు తెల్లగా నది నీటి నురగ లెక్క. అరె యెమైనవు యెటూపోయినవు అత్తా పత్తా లెవ్వు కనీసం ఒక్క మాటన్న చెప్పవా - చిరుకోపం ప్రదర్శిస్తున్న నా గొంతులో కోపం కన్నా ఎందుకో అమితమైన ప్రేమే వినబడిందనుకుంట – సారీ అన్నా ఊరికి పోయిన అర్జెంటుగా మా నాన్న రమ్మనినుండే. అన్నడు చాలా అపాలెజేటిక్ గా. పర్లేదు పర్లేదు ఇప్పుడు క్లాస్ ఉంది ఒక నిమిషాల్లో వస్తా ఇక్కడే ఉండు లేక పోతే మళ్ళా రా తప్పకుండా రా – అని ఉరికిన - అప్పటికే క్లాసుకు ఐదు నిమిషాలు లేటయిన. క్లాసు చెప్తున్నా కానీ నా మనసంతా తన మీదే – వెయిట్ చేస్తడు కదా పోడు కదా అనుకుంటున్న మనసుల. క్లాసు కాంగానే రూమ్ కు ఉరికిన. ఉన్నాడు తను అక్కడే నా కోసం వెయిట్ చేసుకుంట యేదో పుస్తకం చదువుకుంట – పోంగనే నా కుర్చీ గుంజుకొని కూర్చుని ఇగ చెప్పు. యెటుపోయినవు యేమి సంగతి. తను అర్జెంటు గా ఊరికి పోవాల్సిన పరిస్తితి చెప్పి క్షమించమన్నడు – అంత దానికే క్షమాపణ ఎందుకు అని నా బాగ్ ల కెల్లి నోటు బుక్ తీసి ఇచ్చిన . చాలా బాగున్నాయి నీ పోయేమ్స్ – యెప్పట్నుంచి రాస్తున్నవు? చాలా మెచ్యూరిటీ తో ఉన్నాయి ఈ కవితలు రూపం లోనూ వస్తువు లోనూ సారం లోనూ అన్న నేను. థాంక్స్ సర్ అన్నాడు వినయంగా. మాట్లాడుడు మొదలుబెట్టిండు.

ఒక ప్రవాహం లెక్క – తను చదివిన పుస్తకాలు కవిత్వం – సాహిత్యం అన్నీ చెప్తున్నాడు. నేను అఫ్సోస్ ఐన తను చదివిన పుస్తకాలు వింటుంటే. ఇన్ని చదివిండా అప్పుడే? ఎంత అదృష్టం? పోయేమ్స్ మంచిగున్నయి చాలా – ఇంకా రాయాలి అద్భుతంగా అన్న – నాకు తెలిసినా కొన్ని పుస్తకాలు కవులు చెప్పిన. కొన్ని చదివిండు తను అప్పటికే. టైమ్ చూస్తే ఆరు కావస్తుంది. ఇగ పోదామా అన్న. సరే సర్ అన్నడు అయిష్టంగానే. నడుస్తున్నప్పుడు చెప్పిండు తనది వరంగల్ అని తన నాన్న రైల్వేస్ లో గార్డ్ అని తనకో తమ్ముడున్నాడు అని . మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని మెహ్దీపట్నం దాంక తీసుకొచ్చిన. ఇక్కడ దిగుతా సర్ మా రూమ్ కు పోతా. మళ్ళా రేపు కలుస్తా అన్నడు. తప్పకుండా అన్న. తను పోతుంటే యాది కొచ్చింది తన పేరే అడుగలేదు అని – నీ పేరు సారీ మొన్నట్నుంచీ అడుగుడే మర్చిపోయిన – సర్ నాదే తప్పు నేనే చెప్పాల్సి ఉండింది మొదట కలిసినప్పుడే – శ్రీనివాస రావు – యెమ్ శ్రీనివాస రావు అన్నాడు తను ఇంకో సారి చెయ్యి సాచుకుంట – నేను ఆ చెయ్యి అందుకుని ఆత్మీయంగా వొత్తిన – సర్ మీరేమనుకోకుంటే మిమ్మల్ని అన్నా అనొచ్చునా అన్నాడు . ఓ తప్పకుండా అన్న నేను. అప్పటికే నాకు తెల్వకుంటనే తను నన్ను అన్న అని పిలిచిండు అన్న విషయం అప్పుడు కానీ గుర్తు పట్టలేదు.

ఇగ అప్పట్నుంచి నాలో ఒక భాగమైపోయిండు శ్రీను. నేనెటు పోతే తనక్కడ. ఉన్నంత సేపు తన మాటలు నీటి ఊటలు - వాన నీటి చినుకులు - ఉధృతంగా తడిపి ముద్ద చేసే జోరు వానలు – యెడతెగని ప్రవాహాలు – హోరెత్తే జలపాతాలు - ఎన్ని సంగతులు ఎన్ని సంగతులు ఎన్ని ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు యెన్ని విషయాలు యెన్ని విషయాలు – తను చదివిన పుస్తకాలు పుస్తకాలే కాదు చూసిన సినిమాలు – ఎన్ని మంచి సినిమాలు చూసిండో తను – సత్యజిత్ రే మృణాల్ సేన్ రిత్విక్ ఘాటక్ శ్యామ్ బెనెగల్ ఆదూర్ గోపాలకృష్ణన్ ముఖాముఖం షాజీ కరుణ్ పిరవి – తానూ నాలాగే దూరదర్శన్ ఆదివారం మధ్యాహ్నం సినిమా కు అడిక్ట్ అయిపోయిండు. ఘాటక్ మా ఇద్దరికీ ప్రత్యేకంగా చాలా ఇష్టం – మేఘే ఢాకా తారా లో అప్పటి దాంక కుటుంబానికి అంకితమై పోయి చివరికి టీబీ బారిన బడి చివరి సీన్ లో నాకు బతకాలని ఉంది అని సుప్రియా చౌదరి రోదించిన దృశ్యం తలుచుకుని ఇద్దరం కన్నీళ్లు పెట్టుకున్నం. ఆ సినిమా ల ఘాటక్ మెలోడ్రామా ను వాడిన తీరు, కొరడా తో చెళ్లుమనిపించే చప్పుడు ను నేపథ్యం లో వాడిన పద్దతి ఎన్ని సార్లు చెప్పుకున్నమో. సత్యజిత్ రే ప్రతిద్వంది లో ఇంటర్వ్యూ సీన్ ఎన్ని సార్లు యాది చేసుకున్నమో. ముఖాముఖం లో ఉద్యమ స్ఫూర్తి నీరు గారి సైద్ధాంతికంగా డొల్ల ఐన కమ్యూనిస్టు నాయకుడు జీవచ్ఛవంగా మారిన పద్దతి – చివరగా యువతనే యెట్లా భవిష్యత్తు వెలుగు రేఖనో సూచన ప్రాయంగా ఆదూర్ చెప్పిన తీరూ - అట్లా సినిమాలే కాదు సంగీతం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం నుండి సైగల్ పాటల నుండి గద్దర్ పాటల వరకు ఎన్నో ఎన్నో ఎంతో సంగీతం. పుస్తకాలైతే మా ఇద్దరి మధ్యా ప్రవహించేటివి. కవిత్వం మా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఊపిరయ్యేటిది. తను మా రూమ్ కు వచ్చిండు ఓ సాయంత్రం. వస్తూ వస్తూనే పుస్తకాల మీద పడ్డడు. పక్కనే కాసెట్లు ఉంటే వాటినీ ఆవురావురనుకుంట మర్లెసిండు. కాసెట్ ప్లేయర్ ల పెట్టుకొని విన్నాడు. ప్రకాష్ కిరణ్ లకు పరిచయం చేసిన. వాళ్లతోటీ అల్లుకుపోయిండు. ఒక్క క్షణం ఊకోడే - ఒక్క క్షణం కూర్చుండడే – సుడులు తిరిగే ప్రవాహమే తను. నాకు ఎన్నో కొత్త ప్రపంచాలు తెరిచిండు. నా జీవితం లో క్షణాలను వెలిగించిందు ఒక కాగడా గా. నాతో కిరణ్ ప్రకాష్ కూడా తనంటే ఇష్టం పెంచుకున్నారు. చాలా సార్లు మా రూమ్ లోనే పండుకునెటోడు. అట్లా ఉన్న రోజు మాకు టైమ్ తెలిసేటిది కాదు ముచ్చట్ల తోని. చాలా సార్లు యే ఉదయం నాలుగు గంటలకో పండుకునేటోల్లము. మళ్ళా తెల్లారి కాలేజీ కి పోవాలి అంటే చాలా విసుగ్గా ఉండేడిది.
సెలవులు వస్తే తను ఊరికి పోయి వస్తా అనెటోడు. జల్దీ రా అనేటోన్ని. తను లేనప్పుడు ఆ లోటు స్పష్టంగా తెలిసేటిది. ఓ సారి వరుసగా రెండు రోజులు తను కనబడలేదు. ఏమైండబ్బా అని క్లాసుకు పోయి చూసిన . తను వస్తలేడని చెప్పిండ్రు. ఎటు పోయిందో తెల్వదు. మూడు నాలుగు ఐదు రోజులట్లా గడుస్తున్నాయి. తన జాడ లేదు. మళ్ళా ఊరికి పోయిండా. వాళ్ళ కుటుంబం లో అందరూ బాగేన. పోదామా వరంగల్ కు అనుకున్న కానీ ఇల్లెక్కడో తెల్వదు. ఎవరిని అడగాలి వాళ్ళ నాన్న పేరు కాలేజీ లో కనుక్కోవచ్చు కానీ వాళ్ళ ఇంటికి పోవడం సమంజసమా – ఇన్ని ఆలోచనలు మెదిలినాయి నాలో – సరే ఎదిరి చూద్దాం అనుకున్న – వారం దాటింది తను జాడ లేడు. నాకు రంది మొదలైంది. వాళ్ళ నాన్న పేరు ఇంటి అడ్రస్ కనుక్కుని తనకు ఫోన్ చేసిన – ఒక దోస్తు లెక్క – లేదు బాబూ రాలేదు ఇంటికి అన్నాడు తను కొంచెం ఆందోళనగా – ఎక్కడికి పోయిండో తెలుసా నీకు అని నన్నే అడిగిండు. నాకు ఇంకా బుగులైంది. నా ఆదుర్దా ను ఆందోళన ను కప్పిపెట్టి లేదు అంకుల్ నేను కనుక్కొని చెప్తా అన్న తనతో. ఇగ తన రూమ్ వెతుక్కుంటూ పోదామని నిర్ణయించుకున్న. అందరినీ అడిగిన. ఎవరూ ఖచ్చితంగా చెప్పలేదు. ఉసూరు మనుకుంట మా రూమ్ కు పోయి కిరణ్ కూ ప్రకాష్ కూ చెప్పిన. ఏమి పర్లేదు లే వస్తడు చిన్న పిలగాడు కాదు కదా అన్నారు. ఆ రోజు అన్నం సరిగా తినబుద్ది కాలేదు. నిద్ర పడుతలేదు. పొద్దున నాలుగున్నర కు రూమ్ తలుపు ఎవరో కొట్టినట్టైతే దిగ్గున లేచి పొయ్యి తీసిన . దర్వాజ ల తను. మట్టి గొట్టుక పోయిన బట్టల తోని పీక్క పోయిన చెంపల తోని . కండ్లు రెండు లోపలికి గుంజుకపోయినై. అన్న పది రూపాయలివ్వవ ఆటో కివ్వాలే అన్నడు. ఎటు పోయినవు ఏమి సంగతి అత్తా పట్టా లేవ్వు అని అడుగబోతున్న నాకు, అన్నా అన్నీ చెప్త జర పైసలివ్వవా అని అడిగి నేను ఇవ్వంగానే కిందికి ఉరికి పొయ్యి ఆటో కిచ్చి తన మాసిన బాగ్ తో లోపలికి వచ్చిండు. అన్నా ఆకలి దంచేస్తుంది ఏమన్నా ఉందా తినడానికి అని అదిగి వంటింట్లకు పోయిండు. రాత్రి మిగిలిన అన్నం కూర కలుపుకొని ఆదరా బాదరా గా నాలుగు ముద్దలు తిని పక్కకు వచ్చి కూసున్డు. ఇగ చెప్పు యాడికి పోయినవు ఇన్ని రోజులు అని అడిగిన కొంచెం కోపంగా .
ʹఅన్నా చీరాల పోయినʹ అన్నడు. ʹచీరాలనా అక్కడేమీ పని నీకు?ʹ అన్నా చీరాల ల చేనేత కార్మికులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. అది స్టడీ చేద్దామని పోయిన అని బాగ్ ల కెళ్ళి కట్ట కాగితాలు తీసిండు. అన్నీ నోట్స్ . కవితలు. చీరాల వ్యదార్థ జీవిత యదార్థ శకలాలు. వెతల బతుకులతో తో నిండిన కాగితాలు – తగిలితే చివ్వున కన్నీరు చిమ్మే వాక్యాల పదాల అక్షరాల దొంతరలు. చదువుతూ ఉన్నాడు. నేను వింటూ ఉన్న. నా కండ్ల నుండి నీళ్ళు ఎప్పుడు ప్రవహించినయో ఎంత సేపు ప్రవహించినయో నాకే తెల్వదు. అక్కడ చేనేత కార్మికులతో కలిసే తందుకు వాళ్ళలో ఒక్కడయ్యేందుకు తను పడ్డ పాట్లు, చేసిన పనులు – రిక్షా తొక్కిండు – వాళ్ళకు కూలి చేసి పెట్టిండు చేనేత పనిలో సాయం చేసిండు దారం కండెలు చుట్టిండు. మగ్గం నేసిండు. అన్నీ తనకు కొత్తైనా చాలా సులువుగా నేర్చుకుని చేసిండు. అప్పుడు తెల్సింది తన సామాజిక నేపథ్యం. దళితుడు తను. ఎవరితో నైనా అట్లా కల్సిపొయ్యేటోడు – ఎవరి జీవితాన్నైనా అట్లా తనది చేసుకునేటోడు. చీరాల చేనేత కార్మికుల జీవితాల గురించి తను రాసిన నోట్స్ వ్యాసాలు కవితలు అద్భుతంగా కదిలించినయి. తన జేబులో కేవలం పోను బస్సు కిరాయ మాత్రమే పెట్టుకోని సంచీల కాగితాలు ఒక జత బట్టలతో పోయిండు అక్కడికి. మిగతా అంతా అక్కడే తానే శ్రమ చేసి సంపాదించుకున్నడు తిండైనా వసతైనా అందుకే కూలి చేసిండు రిక్షా తొక్కిండు . తను చెప్తుంటే నేనట్లే నోరు తెర్సుకొని విన్న. కండ్ల పొంటి నీటికి కరువులేదు. ఎంత గొప్పగా విశ్లేషించిండు వాళ్ళ జీవితాలను వాళ్ళ ఆర్టిక పరిస్తితిని. ఒక ఆర్థిక వేత్త లెక్క – మళ్ళా వాళ్ళ వెతలు చెప్పెటప్పుడు ఒక గొప్ప కవి లెక్క. అంతా విన్నంక గట్టిగా కాగలిచ్చుకున్న. నాకా క్షణం శ్రీను ప్రపంచం లో అందరికన్నా యెంతో ఉన్నతంగా కనిపించిండు. అప్పట్నుండి శ్రీను నా గుండెకాయ అయిపోయిండు

తను రెండవ సంవత్సరం ప్రవేశిస్తున్న సమయానికి నాకు విద్యతో పెండ్లి. మేము కాపురం పెట్టిన రూమ్ కు కూడా తను వస్తుండే. వదినా వదినా అనుకుంట తన వెంట కొంగు పట్టుకొని చిన్న పిలగానిలెక్క తిరిగెటోడు. మేము తిన్నదే తిని మాతోనే ఉండుకుంట ఎన్నో ముచ్చట్లు చెప్పేటోడు. అతి తక్కువ కాలం లోనే విద్యకు అత్యంత సన్నిహితుడైనాడు. తను వచ్చిండంటే మాకు ఆ రోజు వెన్నెలే. అట్లా మా ఇంట్లో, మా లో భాగమైపోయిండు శ్రీను. తన మాటలు కలుపుగోలు తనమే కాదు తన ఆత్మీయత కూడా అందుకు కారణమే. శ్రీను అంటే ఆత్మీయతకు మూర్తీభవించిన ప్రేమకు ఒక చిహ్నంగా ఉండేటోడు. రోజు రోజుకూ తన మీద మా ప్రేమ పెరిగింది. మా మధ్య అనుబంధం మరింత గట్టిపడింది.

ఐతే తనలో ఒక గాంభీర్యత పెరగడం చూసిన. ఒక అద్భుతమైన పరిపక్వత, మెచ్యూరిటీ , గంభీరత. మాటలో తీరులో నడకలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తన అధ్యయనం తన రాతలు తన కార్యా చరణ కారణమని స్పష్టంగా తెలుస్తున్నాయి. తను ఏదో సంస్థలో చురుకుగా పనిచేస్తున్నడని నా కర్థమైంది. ఈ లోపల 1990 లో విరసం ఇరవై ఏండ్ల సభలొచ్చినయి. తను చాలా చురుకుగా పనిచేసిండు. మాతో కలిసే ఉన్నాడు. సభల్లో ఊరేగింపులో కలిసి తిరిగిండు. అన్న ఏమి చెయ్యాలే అనుకుంటా మాకు కుడిచెయ్యై సభలల్ల పాల్గొన్నాడు. మాకు సహాయం చేసిండు. పెయ్యి తెల్వకుండా పనిచేసిండు. సభలు విజయవంతం కావడం లో తన పాత్ర ఎంతో ఉంది.
మేము పద్మనాభ నగర్ లో రెండో ఇంటికి పోయినంక ఒక సారి ఇంటికి వచ్చిండు. ఏమైంది శ్రీనూ చాలా రోజులైంది అంటే అన్న పని ఉండే అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంట. నాకు తెలుస్తనే ఉంది తనేదో ఆర్గనైజషన్ లో పని చేస్తుండు తీరిక లేకుండా అయిండు అని. అన్న తను రూమ్ కు వచ్చినప్పుడు మా బాపు ఉండే. మా అమ్మకు సర్జరీ ఐతే తను మా ఇంట్లనే ఉండే. బాపు అమ్మను మా దగ్గర ఉంచి స్కూలు కు పోతా అని తయారైండు. బాపుకు పరిచయం చేసిన శ్రీనును. ఇద్దరూ ప్రేమగా పలకరించుకున్నారు. అన్నా పుస్తకాలున్నాయా కొత్తయి అని చనువుగా బుక్ షెల్ఫ్ ల చూసిండు. తనకు కావల్సిన పుస్తకాలు తీసుకొని అన్న పోత ఇగ అంటే భోంచేసి పొమ్మని పోతూ పోతూ బాపును బస్టాప్ దాంక తీసుక పొమ్మని చెప్పి నేను కాలేజీకి పోయిన. తను బాపును బస్టాప్ ల దింపి పోయిండు. నిజానికి నా కన్నా మా బాపు చివరి చూపు తనకే దక్కింది. తర్వాత నెల రోజులకే బాపు మమ్మల్ని విడిచి వెళ్లిపోయిండు.

తర్వాత తర్వాత శ్రీను నాకు విద్యకు ఎక్కువ కనబడలేదు. కాలేజీ కూడా వచ్చుడు బందు చేసిండు. కాకతీయ ఎక్స్ప్రెస్స్ బోగీకి అప్పుడు పీపుల్స్ వార్ నిప్పు పెడితే నలభై మంది దాంక చనిపోయినప్పుడు ఒక అద్భుతమైన కవిత వచ్చింది. పేరు యెమ్ ఎస్ ఆర్ అని ఉంది. తనే అది శ్రీనే అనుకున్న ఆ వ్రాత పద్దతి శైలీ చూసి. తర్వాత వీ వీ సార్ చెప్పిండు తనే అని. తను యూ జీ కి వెళ్లిపోయిండని ప్రజల్లో కలిసి పనిచేస్తుండని పూర్తికాలం విప్లవోద్యమానికి అంకితమైండని. నాకు ఒక్క క్షణం చాలా గర్వంగా అనిపించింది. తను అత్యున్నత శిఖరాలకు ఎదిగినందుకు. మరో క్షణం తీవ్రమైన బాధా దుఃఖం తను కనిపించడమ్ కలవడం చాలా తగ్గిపోయిందని. తర్వాత మరో కవిత చూసిన కాగడాగా వెలిగిన క్షణం అని – అదీ ఎం ఎస్ ఆర్ పేరు మీదనే – గొప్ప కవిత – వీ వీ సార్ కు చెప్పిన అద్భుతంగా ఉందని. కాలేజీకి శ్రీను రావడం పూర్తిగా తగ్గిపోయింది. శ్రీను ను చాలా మిస్ ఐన నేను. ఎప్పుడూ వెన్నంటి ఉండే తను మెల్ల మెల్లగా నాకు దూరమైతుంటే నేను నాలో యేదో ఒక ముఖ్యమైన దాన్ని కోల్పోతున్నట్టు అనిపించింది. నాకు తను లేని లోటు స్పష్టంగా తెలుస్తున్నది. కానీ ఒక ఉన్నతమైన కార్యాచరణ లో తనున్నందుకు గర్వపడిన. తను లేని లోటును అదే ఆ సంతృప్తే పూడ్చింది చాలా వరకు. ఐతే లోలోపల తనకేమన్నా అవుతదేమో అనే భయం వెంటాడేది. లోలోపల తొలిచేది. చాలా మంది అడిగిండ్రు నన్ను. ఏమైండు శ్రీనివాసరావు అని. తెలిసిన వాళ్ళకి వివరాలు చెప్పిన తెలవని వాళ్ళకు టూకీ గా చెప్పిన. మా కాలేజీ లో అప్పుడే చేరిన శరతన్న నాకు బాగా సన్నిహితమైనరు. ఇద్దరిదీ ఒకటే ప్రాపంచిక దృక్పథం. ఇద్దరిదీ ఒకటే బాట. ఇద్దరం టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యూనియన్ లను ఐక్యం చెయ్యడంలో, ఉద్యమించడం లో చురుకుగా ఉన్నము. మేనేజిమెంట్ తో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నము . శరతన్న మాకు నాయకుడు. చాలా గొప్ప వ్యక్తిత్వం గొప్ప నాయకత్వ లక్షణాలు. యేది చెప్పినా ముందు తను ఆచరించి చూపెటోల్లు. నన్ను బాగా ఇన్స్పైర్ చేసి ప్రభావితం చేసిన వాండ్లలో శరతన్న ముఖ్యుడు. అట్లా బాగా సన్నిహితులమూ స్నేహితులమూ అయినము ఇద్దరమూ. తనకు చెప్పేటోన్ని శ్రీను గురించి. తనకు కూడా పరిచయం అయిండు శ్రీను. శరతన్న కు కూడా శ్రీను అంటే చాలా ఇష్టం. శ్రీనును ఇష్టపడని వాళ్ళు ఎవరని?

ఒక సారి సారస్వత పరిషద్ హాల్ లో పైన రూమ్ విరసం సభ ఒకటి పెట్టినమ్ సిటీ యూనిట్ తరపున. సభ ప్రారంభమైనంక ఎందుకో వెనుకకు చూస్తే హటాత్తుగా శ్రీను కనబడ్డడు. ఒక్క లిప్త పాటు మా చూపులు కల్సినయి. తన కండ్లలో మెరుపు. ఒక చిర్నవ్వు. నా కండ్లు కూడా మెరిసే ఉంటయి బహుశా. సభ అయిపోయినంక తనను కలుద్దామని వెనుకకు చూస్తే తను లేడు. తొందర తొందరగా బయటకు పోయిన. తను కనబడలేదు. తనతో కూర్చున్నోళ్ళు ఉన్నరు. తనెక్కడ అని ఎవరినీ అడగాలని అనిపించలేదు. ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నది. ముల్లెదో గుచ్చుకున్నట్టు అనిపించింది. తను వచ్చి నన్ను కలుస్తడని మాట్లాడిస్తడని అనుకున్న. ఆశించిన. తను ఒక్క మాట ఐనా చెప్పకుండా పోవుడు నన్ను బాగా నిరాశపర్చింది. తర్వాత అనిపించింది. యేమో తన కార్యాచరణలో ఒక బహిరంగ వ్యక్తినైన నన్ను కలవడం సరైంది కాదేమో? లేక పోతే శ్రీను నన్ను కలవకపోవుడేంది నాతో మాట్లాడకపోవుడేంది?

ఆ రోజులల్ల ప్రతి నెల మొదటి ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న బాగ్ లింగం పల్లి పార్క్ (దానికి సుందరయ్య పార్క్ అని కూడా పేరు) లో మా విరసం సిటీ యూనిట్ మీటింగ్ ఉండేది. సెప్టెంబర్ ఆరో తారీకు ఆదివారం ఎప్పట్లెక్కనే యూనిట్ మీటింగ్ కు పోయిన. నేనూ కిరణ్ పొయ్యేసరికే వీ వీ సర్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నరు. అందరూ చాలా సీరియస్ గా ఉన్నరు. గంభీర విషాద వదనాలతో ఉన్నరు. యెమైంది సర్ అన్న. సార్ తన చేతుల ఉన్న ఈనాడు పేపర్ సిటీ ఎడిషన్ నాకు ఇచ్చిండు. ఏమైంది ఏమి వార్త అంటూ పేపర్ తిరగేస్తున్న నాకు ఒక మూల చిన్న వార్త – సెప్టెంబర్ 2న (డా రామనాథం వర్ధంతి ఆ రోజు ) పఠాన్ చెరు లో ఎంకౌంటర్ – కార్మిక వాడలో పోలీసు కాల్పుల్లో పీపుల్స్ వార్ నక్సలైట్ హతం – ఒక ఇంట్లో సాయుధుడైన నక్సలైట్ ఉన్నదని తెలుసుకున్న పోలీసులు ఎంత లొంగిపొమ్మన్న లొంగకుండా కాల్పులు జరిపిన నక్సలైట్ – పోలీసు ఎదురుకాల్పులల్ల మృతి చెందిండు అని వార్త. నక్సలైట్ పేరు కరుణాకర్ అని ఉంది. చిన్న ఫోటో వేసిండ్రు. ఎవరు సార్ అన్న నేను – మీకు తెలుసు మీ స్టూడెంట్ అన్నరు సార్, విషాదం నిండి కండ్ల నీళ్ళు దుంకడానికి సిద్దంగా ఉన్న కండ్లతో – అంతే హా అన్న మాట ఒక్కటి నా నోటి నుండి రావడం గుర్తుంది. ఎవరూ శ్రీను కాదు కదా, కాదు కాదు శ్రీను కాకూడదు శ్రీను కాదు తానెందుకు పఠాన్ చెరు కు పోతడు – తను కానే కాదు – తను కాదు – నా లోపల లోలోపల సుడులు తిరుగుతున్న ఆలోచనలు – కండ్ల ముందంతా శ్రీనే – అన్న నాకేం కాలేదు నేను మంచిగున్న అంటున్నడు – అవును ఎం ఎస్ ఆరే మీ శ్రీనివాస రావే అన్నరు సార్ – సార్ గొంతు పూడుక పోయింది. నా కండ్లు చీకటి అయిపోయినాయి. కూర్చున్న చోటు కదిలిపోయింది. చుట్టూ పెద్ద తుఫాను – పెను వర్షం జడివాన ముంచేస్తున్న జడివాన – మునిగిపోతున్న ఒంటరి పడవ – తీరం ఎక్కడా లేదు – దుఃఖం దుఃఖం వేదన గడ్డపారలు గుండెల్లో దిగుతున్నట్టు – సర్రున మెదడులోపలికెల్లి కత్తులు దూసుక పోతున్నయి – కనుగుడ్ల మీద నెత్తురు కారుతున్నది ఆగకుండ – యేమీ కనబడుతలేదు – కనుగుడ్డును బ్లేడుతో కోస్తున్నరెవరో - అంతా నల్లని నెత్తురు – చిక్కని నెత్తురు – గడ్డ కడుతూ జారిపోతున్న నెత్తురు – యేమీ వినబడడం లేదు – కిరణ్ నన్ను పట్టుకున్నట్టు తెలుస్తున్నది – సార్ నా చెయ్యి పట్టుకున్నట్టు గుర్తున్నది చివరగా.

యెట్లా చంపబుద్దైంది మా శ్రీను ను – అంత లేత చిరునవ్వును ఎట్లా చిదిమెయ్యబుద్దైంది వాళ్ళకు – ఆ కండ్లల్ల మెరుపును యెట్లా మలిపెయ్య బుద్దైంది? యెంత క్రూరత్వం? యెంత దుర్మార్గం? ఎన్ని సార్లు చెప్తరు ఈ ఎదురుకాల్పుల కట్టు కథను – శ్రీను కాలిస్తే ఆత్మరక్షణ కు కాల్చిన్ద్రా – పోలీసులే శ్రీను అక్కడున్నాడని తెల్సి చుట్టుముట్టి నిరాయుధునిగా పట్టుకొని తీవ్రమైన చిత్రహింసలు పెట్టి జీవచ్చవం చేసి చివరికి కాల్కిపారేసిన్ద్రా? అంతే అయి ఉంటుంది. ఇది వాళ్ళకు మామూలే కదా – ఇట్లా చెప్పుడు – ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది అనుకుంటూ విలవిల్లాడి, తండ్లాడి తండ్లాడి యెంత గోసగా ప్రాణం వదిలిండో తమ్ముడు శ్రీను. ఒకరికి దెబ్బ తగిలితే, ఒకరికి నొప్పి ఐతే ఎంతో విలవిల్లాడే ఆ సున్నితమైన హృదయం, కన్నీళ్ళై కవిత్వమై ఉప్పొంగే ఆ లేలేత హృదయాన్ని అంత కర్కోటకంగా యెట్లా నలిపెయ్యగలిగిండ్రు – చంపి పారేసి ఆత్మరక్షణ కు చంపినమని అన్నారు ఎంత నిర్దయ ఎంత దుర్మార్గం – ఎక్కడో చీరాలలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నడని తెలిసి తను కూలి చేసైనా సరే వాల్ల బతుకుల్ని తెలుసుకుందాం అని వెళ్ళిపోయిన ఆ అద్భుత మనస్తత్వం కలిగిన, మానవతకు నిలువెత్తు రూపమైన, ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని చంపడానికి వాళ్ళకు చేతులెట్ల వచ్చినయో. నా వేదనకూ దుఃఖానికీ అంతులేదు, నా కండ్ల నుండి పటపట దుంకే కనీళ్ళకు ఆనకట్ట వెయ్యడం నాకు దుస్సాధ్యమైంది.

వారం రోజులైంది మళ్ళా నేను కొంచెం నా సెన్సెస్ లోకి వచ్చి కాలేజీకి పోవడానికి – కాలేజీకి పొయ్యేసరికి అంతా పలకరించిండ్రు. ఏమైంది సార్ అని – శ్రీను తెలిసినోళ్లకు చెప్పిన – తెల్వనోళ్లకు నా దుఃఖానికి మాటలెట్ల ఇవ్వాలో అర్థం కాలేదు. శరతన్న కనబడితే భోరున ఏడ్చిన – నన్ను ఓదార్చిండ్రు సారు. కాలేజీ చుట్టూ తిరిగి శ్రీను కాలేజీ ల తిరిగిన చోట్లన్నీ తిరిగి చూసి దుఃఖాన్ని మరింత దుఃఖం తో చల్లార్చుకున్న.

ఆ మధ్యాహ్నం నా రూమ్ కు ఇద్దరు పోలీసులు వచ్చిండ్రు. నువ్వేనా ఫలానా అని – అవును అన్న – దినేష్ రెడ్డి సార్ పిలుస్తున్నరు తీసుక రమ్మన్నరు అన్నారు. ఎందుకు అన్న – ఏమో సారే చెప్తరు అన్నరు – సరే వస్తా తర్వాత అన్న – లేదు ఇప్పుడే అన్నారు – కుదరదు ఇప్పుడు నేను కాలేజీ ల ఉన్న పెర్మిషన్ తీసుకున్నారా అన్న – లేదు అని నీళ్ళు నమిలిండ్రు – తర్వాత వస్తా అన్న. ఈ విషయం మా దోస్తులకు చెప్తే పొయ్యి రారాదూ అని సలహా ఇచ్చిండ్రు – ఎందుకైనా మంచిదని మా ప్రిన్సిపాల్ బసివి రెడ్డి సర్ దగ్గరకు పోయిన . అప్పటికి తనకూ మాకూ పెద్ద పోరాటమే నడుస్తుంది.మేమేమో యూనియన్ తరఫున తనతో కొట్లాడుతున్నాం – ఏమిటీ సంగతి అన్నారు – విషయం చెప్పిన – కూర్చో అని నాముందే ఫోన్ కలిపిండ్రు – అవతల దినేష్ రెడ్డి – స్టూడెంట్స్ ను నక్సలైట్లు గా మారుస్తున్న అన్న నెపం మీద నన్ను విచారించడానికి పిలిచిండట – తను విరసం సభ్యుడే కానీ నక్సలైట్ కాదు నక్సలైట్లను తయారూ చెయ్యడం లేదు నా పూచీ అని హామీ ఇచ్చి బసివి రెడ్డి సర్ దినేష్ రెడ్డిని ఒప్పించిండ్రు. నేను సర్ కు థాంక్స్ చెప్పి బయటపడ్డ –

ఐనా నన్ను పోలీసు నిఘా వెంటాడింది – గద్ద కండ్లతో నన్ను వెంటబడి పసిగట్టింది – నా ప్రతి కదలికనీ గమనించినట్టు నా పేరుతో ఇంటెలిజెంసు ఆఫీసు లో ఒక ఫైల్ తయారైందని వివరం తెలిసింది. ఐనా నా విరసం కార్యక్రమాలు ఆగలేదు. శ్రీనును నా హృదయం నుండి జ్ఞాపకం నుండి తొలగించడం ఎవరి తరమూ కాదు – యే శక్తీ ఆ లేత చిరునవ్వును మరిచేటట్టు చేయలేదు.

శ్రీను నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవుడే. ఇవాళ్ళ నేను ఒక భద్రలోక ప్రపంచం లో సాధారణ జీవితం గడుపుతూ తనని గుర్తు చేసుకోవడం గుండెని కుమ్మరి పురుగులా తొలిచేస్తుంది. కానీ రెండు రకాలుగా శ్రీను నన్ను వెంటాడుతాడు –
అత్యున్నత స్థాయి కార్యాచరణతో నన్ను ప్రశ్నిస్తూ –
ఎక్కడ ఎవరికి కష్టమొచ్చినా స్పందించే తన సున్నితమైన హృదయంతో ...
నన్నెప్పుడూ నా సున్నితత్వాన్నీ , నాలోని నిప్పును చల్లారకుండా కాపాడుకోమని హెచ్చరిస్తూ ...
నిప్పుకోసం
యిక్కడ యింతకు మునుపు
ఊహల అంచుల మీద
వూయలలూగిన పద సౌందర్యం తొణికిసలాడేది
యిక్కడ యింతకుముందు
సొగసులూరే కాల్పనికతై
నవయవ్వనం వురుకులు పరుగులు పెట్టేది
వొక్కసారి
యెర్రటి మండుటెండల్లా
రాక్షస పాదాలు నడిచిపోయింతర్వాత
ప్రభువులకు దాసోహమన్న
ఖడక్ ఇస్త్రీల ఫెళ ఫెళ విరుచుకుపడ్డ తర్వాత
యింక యిక్కడ మిగిలింది
గండు పిల్లులు తినేసిన పక్షుల రెక్కల శకలాలు
రాబందుల కర్ణకఠోరమైన మృత్యుగానం
తళుక్కుమనే వుదయకాంతి
నల్లబడ్డ నెత్తుటి చారికై
మట్టిగొట్టుకుపోయిన నేలా -
యెంత ప్రేమను వర్షించేవి
ఆ మృదువైన రెండు కళ్ళూ
గుర్తుకొచ్చి గుండెలో నెత్తురు గడ్డై అడ్డు పడుతున్నది
యెన్ని మాటలు ఊరేవి
ఆ చిన్ని రెండు పెదవులూ
యాదికొస్తే గొంతులో శబ్దం బరువైపోతుంది
మెత్తని కలై
కన్నీటి సేద తీర్చిన
ఆ చిరునవ్వు చెదరి పోయిందని
గాజు బుడగలా చిట్లిపోయే
అమ్మకు ఎట్లా చెప్పడం?
వూపిరి సలపనీయని
యీ యేడ్పును యెట్లా బిగపట్టుకోవడం?
వాస్తవమే
రెండు రాళ్ళు రాపిడి చెందితేనే
ప్రాణం నిలిపే నిప్పు జన్మిస్తుంది
ముమ్మాటికీ నిజమే
రాజ్యమైన దుర్మార్గాన్ని మేడలు వంచెటందుకు
పసితనమూ క్రోధమై చెలరేగిపోవాల్సిందే
నిండు ప్రాణం సాక్షిగా సరైందే
ద్వేషమే యెల్లెడలా పడగ విప్పినప్పుడు
జీవన లాలిత్యమూ కరుకుదేరి
అధికార మృగాన్ని పొడవాల్సిందే
తమ్ముడూ శ్రీనూ
నీవు లేని శూన్యం వెంటాడుతున్నందుకు
రంది పడుతున్న మాట నిజమే
కానీ
నీవు రాసీ నడిచిన అక్షరాలు
నా కండ్లలో వూపిరిలో పిడికిండ్లలో
యెంత జీవం నింపుతున్నయో
ప్రకటించే శక్తి
ఈ కవిత్వానికెన్నటికీ లేదు

సెప్టెంబర్ 1992

-నారాయణ స్వామి వెంకటయోగి

Keywords : virasam, peoples war, maoists, msr, revolution
(2024-05-21 09:48:37)



No. of visitors : 3545

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కాగడాగా